మాచేనమ్మ వారి ఆలయం గురించి
ఆలయం ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం పెదమల్లం గ్రామం లో గోదావరి నదీ తీరంలో ఈ మాచేనమ్మ వారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే కాకుండా, సమీపం లోని కోనసీమ జిల్లా నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు.
కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ఇక్కడ అమ్మవారిని భక్తులు నమ్ముతారు. నేను ఈ ఆలయాన్ని మొదటిసారి సందర్శించినప్పుడు తెలుసుకున్న విషయాలు, ఆలయానికి వెళ్లే రూట్, అమ్మవారి చరిత్ర, ఆలయ విశేషాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాము.
గోదావరి ప్రాంతంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం గురించి కూడా మా వెబ్‌సైట్‌లో వివరంగా చదవవచ్చు.
మాచేనమ్మ వారి ఆలయం చరిత్ర
ఆలయానికి సంబంధించిన పురాతన కథ
చిన్ననాటి నుంచి మాచేనమ్మ అమ్మవారు లక్ష్మీదేవికి భక్తురాలని స్థానికంగా చెబుతారు. ఆమె లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే, లక్ష్మీదేవి వచ్చి ఆ పూజలో కూర్చునేదని స్థలపురాణంలో చెబుతారు.
అంతటి భక్తురాలికి యుక్త వయసు రాగానే వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమెకు ఒక పండంటి బిడ్డ జన్మించింది. అయితే భర్త అనుమానంతో ఆమెను పుట్టింట్లో దింపివేస్తానని తీసుకువెళ్తున్న సమయంలో, అవమాన భారంతో ఆమె భూమాతను వేడుకుని, “నేను ఈ తప్పు చేయలేదు, నన్ను నీలో కలిపేసుకో” అని ప్రార్థించిందని పూజారి గారు తెలిపారు.
అలా తల్లి, బిడ్డ కలిసి భూమిలోకి కూరుకుపోతుండగా, భర్త ఆమె జుట్టు పట్టుకుని పైకి లాగాలని ప్రయత్నించాడట. ఆ సమయంలో వారు శిలలుగా మారిపోయారని స్థానికంగా చెబుతారు. ఆమె జుట్టును లాగినప్పుడు తెగిపోయిన భాగాన్ని గోదావరి నది చెంతన పడవేయగా, అక్కడి నుంచి “పేరులేని చెట్టు” మొలిచిందని ఆలయ పూజారి గారి ద్వారా తెలుసుకున్నాను.
ఆ తర్వాత శ్రీ మాచేనమ్మ అమ్మవారు శిలగా వెలిశారని చెబుతారు. గ్రామస్తులు ఆ శిలా విగ్రహాలను పైకి తీసేందుకు ఎంత తవ్వినా, అవి మరింత లోపలికి వెళ్తుండటంతో అక్కడే అమ్మవారికి పూజలు చేయడం ప్రారంభించారని పూజారి గారు వివరించారు.
ఇలా సుమారు 400 సంవత్సరాలుగా ఇక్కడ మాచేనమ్మ అమ్మవారికి పూజలు జరుగుతున్నాయని ఆలయ పూజారి గారు తెలిపారు.

మాచేనమ్మ వారి ఆలయం ప్రత్యేకతలు
అమ్మవారి విగ్రహం
అమ్మవారి విగ్రహాలు రెండు తలలుగా ఉంటాయి. సుమారు 5 అడుగుల లోతులో అమ్మవారి శిలా విగ్రహాలు ఉన్నట్లు ఆలయ పూజారి గారు తెలిపారు.
మొదట అమ్మవారి గర్భగుడిలోకి 2 అడుగుల మెట్లు దిగి క్రిందికి వెళ్లి, అక్కడ సుమారు మూడు అడుగుల లోతులో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి విగ్రహాలు రెండు తలలతో ఉండటాన్ని తల్లి, పిల్లగా చెబుతారు.
అమ్మవారి రాతి విగ్రహాలపై వెండి తొడుగు కనిపిస్తుంది. ఆలయ పూజారి గారిని అడిగి అనుమతి తీసుకుని ఆలయం లోపల చిత్రాలు తీయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని ప్రత్యేకతలను కూడా తెలుసుకోవడం జరిగింది.
ఆలయ నిర్మాణం మరియు తాటాకుల పైకప్పు
మాచేనమ్మ వారి ఆలయం లో అమ్మవారికి ఆకాశం కనిపించే విధంగా గుడిలోని పైకప్పును ఏర్పాటు చేయడం ఈ ఆలయంలో కనిపించే ప్రత్యేకతల్లో ఒకటి. దేవాలయాన్ని సిమెంట్‌తో నిర్మించి స్లాబ్ వేసినప్పటికీ, పైభాగంలో మాత్రం తాటాకులతో పైకప్పు ఏర్పాటు చేశారు.
దీనికి సంబంధించిన వివరాలను ఆలయ పూజారి గారు నాకు వివరించారు. పూజారి గారు చెప్పిన ప్రకారం, అమ్మవారి శిలా విగ్రహాలు సుమారు 5 అడుగుల లోతులో ఉండి ఎండకు, వానకు తడుస్తూ ఉండేవట. వాటిని గమనించిన గ్రామస్తులు ఆ విగ్రహాలను పైకి తీసి ఒక పాక ఏర్పాటు చేసి, అందులో అమ్మవారి విగ్రహాలను ఉంచారట.
పైభాగంలో ఏర్పాటు చేసిన కప్పు మాత్రం ఎన్ని సార్లు వేసినా ఎగిరిపోయేదట. ఇలా జరుగుతున్న సమయంలో ఒక రోజు ఒక భక్తురాలికి అమ్మవారు కనిపించి, “ఆకాశం, భూమి నాకు కనిపించాలి” అని చెప్పినట్లు పూజారి గారు వివరించారు.
అందువల్ల ఆ తర్వాత కాలంలో దేవాలయానికి సిమెంట్ భవనాలు నిర్మించినప్పటికీ, పైభాగంలో తాటాకులతో వేసిన పైకప్పును మాత్రం అలాగే ఉంచారని పూజారి గారు తెలిపారు.

ఆలయ పరిసరాల్లో కనిపించే ప్రత్యేక విషయాలు
మాచేనమ్మ వారి ఆలయం పరిసరాల్లో “పేరులేని చెట్టు” అని పిలిచే వందల ఏళ్ల నాటి పెద్ద వృక్షం ఉంది. ఈ చెట్టుకు కూడా భక్తులు పూజలు చేస్తుంటారు. చెట్టు వద్ద ఉన్న చిన్న విగ్రహానికి కుంకుమ పూజలు చేసి, చెట్టు చుట్టూ వేప ఆకులు కట్టి ఉండటాన్ని నేను గమనించాను.
భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. కొంతమంది భక్తులు కోడి లేదా మేకలను ఇక్కడే అమ్మవారికి సమర్పించడం కూడా నేను గమనించాను.
ఆ తర్వాత భక్తులు అక్కడే వంటలు వండుకుని భోజనం చేస్తారు. మిగిలిన ఆహారాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లకుండా, అక్కడే ఇతరులకు పంచిపెట్టి ఇంటికి తిరిగి వెళ్తారని అక్కడి పరిస్థితులను బట్టి గమనించాను.
ఈ మాచేనమ్మ కట్టలో వంటలు వండుకోవడానికి స్టవ్‌లు, గ్యాస్ బండలు అద్దెకు లభిస్తాయి. అవసరమైతే టెంట్ సామగ్రి కూడా ఇక్కడే లభిస్తుండటం చూశాను. వంటలు చేసుకోవడానికి, భోజనాలు చేయడానికి వీలుగా ఇక్కడ చిన్న చిన్న రేకుల షెడ్లు కూడా అద్దెకు ఇస్తున్నారు.
కొన్ని షెడ్లు దేవాలయ భూముల్లో ఉచితంగా ఉండగా, ప్రైవేటు భూముల్లో ఉన్న వాటికి సమయాన్ని బట్టి ధరలు వసూలు చేస్తున్నట్లు గమనించాను.
మాచేనమ్మ ఆలయానికి ఎలా వెళ్లాలి?
పాలకొల్లు నుంచి మేడపాడు, దొడ్డిపట్ల మీదుగా మాచేనమ్మ దేవాలయాన్ని చేరుకోవచ్చు.
రావులపాలెం నుంచి సిద్ధాంతం మీదుగా మాచేనమ్మ కట్టకు చేరుకోవచ్చు.
రాజోలు నుంచి అబ్బిరాజుపాలెం రేవు దాటి, దొడ్డిపట్ల మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
కోనసీమలోని గన్నవరం, చాకలిపాలెం ప్రాంతాల నుంచి గోదావరి నది దాటి కూడా భక్తులు మాచేనమ్మ దేవాలయానికి వస్తుంటారు.

మాచేనమ్మ ఆలయానికి దూరాలు మరియు రూట్లు
- తణుకు నుంచి: సుమారు 25 కి.మీ.
- పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల మీదుగా: సుమారు 25 కి.మీ.
- సిద్ధాంతం నుంచి ఏటిగట్టు రోడ్డు మీదుగా: సుమారు 9.5 కి.మీ.
- సిద్ధాంతం నుంచి కోడమంచిలి మీదుగా: సుమారు 13 కి.మీ.
- రాజోలు నుంచి అబ్బిరాజుపాలెం రేవు దాటి: సుమారు 18 కి.మీ.
- రాజోలు నుంచి చించినాడ బ్రిడ్జి మీదుగా: సుమారు 35 కి.మీ
ఆలయంలో నేను గమనించిన విషయాలు
ఆలయ ప్రాంగణంలోని వట వృక్షం
ఆలయ ప్రాంగణంలో ఉన్న వట వృక్షం భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. స్థానికుల విశ్వాసం ప్రకారం, సంతానం లేని దంపతులు ఈ చెట్టుకు ముడుపు కట్టుకుంటే తమ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. అందుకే ఈ వట వృక్షానికి ఎరుపు రంగు వస్త్రాలతో కట్టిన ముడుపులు కనిపిస్తాయి.
ఇది స్థానిక భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం మాత్రమే; దీనిని వైద్యపరమైన లేదా శాస్త్రీయ నిర్ధారణగా భావించకూడదు.
గోదావరి తీరం మరియు ప్రకృతి అందాలు
గోదావరి నది అందాలు, పచ్చని ప్రకృతి మధ్య ఈ ఆలయం ఉండటం వల్ల పరిసర ప్రాంతం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. నేను ఆలయాన్ని సందర్శించినప్పుడు, ముఖ్యంగా ఆదివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది.
వర్షాకాలం మినహా మిగతా కాలాల్లో గోదావరి తీరంలో సరదాగా కొంత సమయం గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం బాగుంటుంది. లంక భూములు కావడంతో వర్షాకాలంలో నేల తడిగా ఉండి, బురద మట్టితో కొంత ఇబ్బందిగా ఉండవచ్చు. అందువల్ల ఆ సమయంలో ఆలయానికి లేదా గోదావరి తీరానికి వెళ్లేవారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది.
గోదావరి ప్రాంతంలోని మరో ప్రముఖ ఆలయం కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయం గురించి కూడా మా వెబ్‌సైట్‌లో వివరంగా తెలుసుకోవచ్చు.

మాచేనమ్మ ఆలయ దర్శనానికి వెళ్లేవారికి ఉపయోగపడే సమాచారం
దర్శనం / పూజల వివరాలు
మాచేనమ్మ ఆలయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో కూడా ఆలయం మూసివేయకుండా దర్శనం కొనసాగుతుందని పూజారి గారు తెలియజేశారు.
వైశాఖ మాసంలో గ్రామోత్సవం
వైశాఖ మాసంలోని మొదటి మంగళవారం అమ్మవారిని గ్రామంలో ప్రతిష్ఠించి గ్రామోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాలు 20 రోజుల పాటు జరుగుతాయి. 21వ రోజున జాతర నిర్వహిస్తారని పూజారి గారు తెలిపారు.
చండీ హోమం
ఆలయంలో చండీ హోమాన్ని రెండు నెలలకు ఒకసారి నిర్వహిస్తారని ఆలయ పూజారి గారు తెలియజేశారు.
కుంకుమ పూజలు
ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. ఈ రోజుల్లో భక్తులు ఆలయానికి వచ్చి పూజల్లో పాల్గొంటారు.
విజయదశమి ఉత్సవాలు
విజయదశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరవుతారని పూజారి గారు తెలిపారు. విజయదశమి రోజున తెప్పోత్సవం కూడా నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు
ఆలయ సంప్రదింపు వివరాలు
ఆలయ దర్శన సమయాలు, పూజలు, ఉత్సవాలు లేదా ఇతర వివరాల గురించి ముందుగా తెలుసుకోవాలనుకునే భక్తులు ఆలయ పూజారి గారిని సంప్రదించవచ్చు.
ఆలయ పూజారి గారి ఫోన్: 76610 74889
వాహనంతో వెళ్లేవారికి సమాచారం
పెద్ద వాహనాలతో మాచేనమ్మ కట్ట వైపు వెళ్లేవారు రహదారి సింగిల్ రూట్‌గా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది. ముఖ్యంగా ఎదురుగా మరో వాహనం వచ్చినప్పుడు ఇబ్బంది కలగకుండా నెమ్మదిగా వెళ్లాలి.
ఆలయానికి సమీపంలో కూరగాయల మార్కెట్ అందుబాటులో ఉండకపోవచ్చు. అక్కడే వంట చేసుకుని భోజనం చేయాలనుకునే వారు అవసరమైన వంటసామగ్రి, కూరగాయలు, ఇతర సరుకులను ముందుగానే సిద్ధం చేసుకుని తమ వెంట తీసుకెళ్లడం మంచిది.

మాచేనమ్మ ఆలయం గురించి స్థానికుల నమ్మకాలు
భక్తులతో మాట్లాడినప్పుడు, తాము తలచిన కోర్కెలు తీర్చే తల్లిగా మాచేనమ్మ అమ్మవారిని నమ్ముతామని కోనసీమ నుంచి వచ్చిన కొంతమంది భక్తులు తెలిపారు. అందుకే తమ కోర్కెలు నెరవేరిన తర్వాత కూడా మళ్లీ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని వారు చెప్పారు.
ముగింపు
మన ప్రాంతాల్లో ఎన్నో గ్రామ దేవతల ఆలయాలు, వాటికి సంబంధించిన నమ్మకాలు, ఆచారాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. మాచేనమ్మ ఆలయం కూడా అలాంటి ప్రత్యేకత ఉన్న ఆలయాల్లో ఒకటి.
మీ గ్రామంలో ఉన్న గ్రామ దేవత ఎవరు? ఆ ఆలయానికి సంబంధించిన విశేషాలు, స్థానికంగా ఉన్న నమ్మకాలు, మీరు తెలుసుకున్న విషయాలు ఏమిటి? మాతో పంచుకోండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
మాచేనమ్మ వారి ఆలయం ఎక్కడ ఉంది?
మాచేనమ్మ వారి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, పెదమల్లం గ్రామంలో ఉంది.
మాచేనమ్మ ఆలయానికి ఎలా వెళ్లాలి?
నర్సాపురం నుంచి పాలకొల్లు మీదుగా మేడపాడు, దొడ్డిపట్ల గ్రామాల మీదుగా మాచేనమ్మ ఆలయానికి చేరుకోవచ్చు.
మాచేనమ్మ ఆలయానికి సమీపంలోని ప్రధాన పట్టణం ఏది?
సిద్ధాంతం ఈ ప్రాంతానికి సమీపంలోని ప్రధాన పట్టణంగా చెప్పవచ్చు.
ఆలయంలో ప్రత్యేకత ఏమిటి?
మాచేనమ్మ వారి ఆలయం లో తల్లి–పిల్ల రూపంలో, రెండు తలలతో ఉన్న అమ్మవారి విగ్రహాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ విగ్రహాలు భూమిలో సుమారు 5 అడుగుల లోతులో ఉన్నాయి. నేను ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ విగ్రహాలను స్వయంగా చూశాను.
మాచేనమ్మ వారి ఆలయం – నా వీడియో
మాచేనమ్మ వారి ఆలయం లో నేను స్వయంగా సందర్శించిన సమయంలో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు మరియు అక్కడి ప్రత్యేకతలను వీడియోగా చిత్రీకరించాను. ఆలయాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ఈ వీడియో ద్వారా అక్కడి వాతావరణం, పరిసరాలను కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
నేను స్వయంగా చిత్రీకరించిన వీడియోను క్రింద చూడవచ్చు.








