కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయ పరిచయం
వాడపల్లి కి ఆ పేరు ఎలావచ్చింది ?
గోదావరి తీరం లో రాజమండ్రి తర్వాత కోనసీమ లోని ప్రముఖ రేవులలో ఈ వాడపల్లి గ్రామం లో నౌకా నిర్మాణ పనులు , నౌకా ల ద్వార వర్తక వాణిజ్యములు జరుగు తూ ఉండేవి . పూర్వకాలం ఈ గ్రామాన్ని నౌకాపురం అని పురాణాల ప్రకారం ” నౌకా పురి ” అని పిలిచే వారు . కాల క్రమం లో నౌకాపురం కాస్తా ” ఓడపల్లి ” అని వాడుక భాష లో వాడపల్లి అని మార్పు చెందింది .
పూర్వం ఒకసారి సనక, సనందనాది మహార్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణున్ని దర్శించుకున్నారు. ఆయనను అనేక విధములుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలుపారు. కలియుగంలో ధర్మంఒంటిపాదంలో నడుస్తోంది. ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యత నిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై, కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారు. అందువలన ప్రజల్ని చక్కదిద్ధి ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని మహర్షులు శ్రీ మహావిష్ణువును అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధముగా చెప్పెను.
కోనసీమ తిరుమల వాడపల్లి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , BR అంబేద్కర్ కోనసీమ జిల్లా , ఆత్రేయపురం మండలం లో ఉన్న “వాడపల్లి తిరుమల – కోనసీమలో అద్భుతమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ”

ఆలయ చరిత్ర & ప్రాముఖ్యత
అధర్మం ప్రబలినప్పుడు, యుగయుగాలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించానని శ్రీమహావిష్ణువు మహర్షులకు వివరించినట్లు పురాణ కథనం చెబుతుంది. కలియుగంలో అధర్మం పెరిగినందున, ప్రజలను ధర్మమార్గంలో నడిపించేందుకు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిగా, అనంతరం గౌతమీ గోదావరి తీరంలోని నౌకాపురి (నేటి వాడపల్లి) క్షేత్రంలో కూడా అవతరిస్తానని స్వామివారు తెలిపినట్లు స్థలపురాణం పేర్కొంటుంది.
కలియుగ ప్రారంభంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు అవతరించారని, అనంతరం గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా–త్రయంబకం వద్ద మహర్షులు తపస్సు చేస్తుండగా స్వామివారు వారికి దర్శనమిచ్చారని పురాణ కథనం. ఆ తరువాత ఎర్రచందనం కలపతో లక్ష్మీదేవి సమేతంగా స్వామివారి దివ్య విగ్రహం అవతరించిందని చెబుతారు.
మహర్షులు ఆ విగ్రహాన్ని పూజిస్తూ ఉండగా, స్వామివారి ఆజ్ఞ మేరకు దానిని ఒక చందన వృక్షంతో తయారు చేసిన పేటికలో ఉంచి గౌతమీ గోదావరి ప్రవాహంలో వదిలారు. ఆ పేటిక నౌకాపురి (వాడపల్లి) క్షేత్రానికి చేరుకుని అక్కడ భక్తులను అనుగ్రహిస్తుందని స్వామివారు తెలిపినట్లు స్థలపురాణం చెబుతుంది. ఈ వృత్తాంతాన్ని దేవర్షి నారదుడు వాడపల్లి ప్రజలకు వివరించినట్లు కథనం.

నౌకాపురం లో స్వామి ఆవిర్భావం
కొంతకాలం తరువాత నౌకాపురి ప్రజలకు గౌతమీ గోదావరి ప్రవాహంలో కొట్టుకొస్తున్న ఒక చందన వృక్షంతో తయారు చేసిన పేటిక కనిపించింది. దానిని ఒడ్డుకు తీసుకురావడానికి గ్రామస్తులు ప్రయత్నించేలోపే అది అదృశ్యమైందని స్థలపురాణం చెబుతుంది.
ఈ విషయం గురించి గ్రామస్తులు పండితులతో చర్చించినప్పటికీ, స్వామివారి లీలను అర్థం చేసుకోలేకపోయారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఒక వృద్ధ బ్రాహ్మణునికి కలలో దర్శనమిచ్చి, “కలియుగ కల్మషం కారణంగా మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు. కనుక వేకువజామున గౌతమీ గోదావరిలో స్నానం చేసి, మంగళవాయిద్యాలతో నదిలోకి వెళ్లండి. కృష్ణగరుడ వాలిన ప్రదేశంలో నేను ఉన్న చందన పేటిక మీకు లభిస్తుంది” అని తెలిపినట్లు కథనం.
స్వామివారి ఆదేశం ప్రకారం గ్రామస్తులు తెల్లవారుజామున గౌతమీ గోదావరిలో స్నానం చేసి, మంగళవాయిద్యాలతో పడవలో నదిలోకి వెళ్లారు. కృష్ణగరుడ వాలిన ప్రదేశంలో వారికి చందన పేటిక లభించింది. దానిని ఒడ్డుకు తీసుకొచ్చి, నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖం, చక్రం, గద ధరించిన లక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ విగ్రహం దర్శనమిచ్చిందని స్థలపురాణం చెబుతుంది.
వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి నామ విశేషం
అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేసి, గతంలో మహర్షులు వైకుంఠానికి వెళ్లి కలియుగ ప్రజలను ధర్మమార్గంలో నడిపించేందుకు మార్గం చూపాలని శ్రీమహావిష్ణువును ప్రార్థించిన విషయాన్ని ప్రజలకు వివరించినట్లు కథనం.
అలాగే, శ్రీమహావిష్ణువు “నౌకాపురి”లో అర్చావతారంగా వెలుస్తానని చెప్పిన విషయాన్ని కూడా నారదుడు వారికి తెలియజేశాడని స్థలపురాణం పేర్కొంటుంది.
వాడపల్లి స్వామివారు సాధారణంగా కనిపించే కటి హస్త ముద్రకు బదులుగా గదను ధరించి దర్శనమివ్వడం ఈ క్షేత్రంలోని ప్రత్యేకతగా చెబుతారు. అనంతరం సప్త ప్రాకారాలతో ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణ కథనం.
“వేం” అంటే పాపాలను, “కట” అంటే పోగొట్టేవాడు అనే అర్థంతో స్వామివారికి “వేంకటేశ్వరుడు” అనే నామం ఏర్పడిందని కూడా పురాణ కథనం చెబుతుంది.
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి నిలువెత్తు దివ్యమంగళ రూపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తిరుమల శ్రీవారిని దర్శించిన అనుభూతి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఒకప్పుడు నౌకాపురం, ఆ తరువాత ఓడపల్లి, కాలక్రమంలో వాడపల్లిగా పేరు మారిందని స్థలపురాణంలో పేర్కొంటారు.
వాడపల్లి తీర్థం, ఉత్సవాలు
వాడపల్లి తీర్థం అంటే గ్రామమంతా ఉత్సవ వాతావరణంతో కళకళలాడే ప్రత్యేక సందర్భం. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామివారి తీర్థం, కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
అలాగే శ్రీ స్వామివారి పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వాడపల్లి క్షేత్రంలో ఏడు శనివారాల వ్రతం కూడా ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందువల్ల శనివారాల్లో ఆలయం భక్తులతో సందడిగా ఉంటుంది.
కోనసీమ తిరుమల వాడపల్లి లో దేశ భక్తి రగిల్చిన రధోత్సవం
1931 సంవత్సరం మార్చి నెల 30వ తేది చైత్ర శుద్ధఏకాదశి పర్వదినం భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చిరస్మరణీయం. ఆ రోజే మాతృదేశ దాస్యవిమోచనోద్యమ గాంధీమహాత్ముని పిలుపు మేరకు ప్రతిస్పందించిన గోదావరి జిల్లలో కోనసీమ లోని స్వాతంత్య్ర సమరమోధులు బ్రిటిషు పాలకుల నిరంకుశత్వాన్ని సంఘటితంగా ఈ వాడపల్లి లో ప్రతిఘటించారు. తమ ప్రియతమ మహాత్ముని చిత్రపటాన్ని త్రి వర్ణపతాకాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి రధం మీద ఉంచి ఊరేగింపు జరుగుతుండగా బ్రిటిష్ పోలీసులు ఆ జండాను తొలగించారు . కోపోద్రోక్తులైన రధోత్సవం లో పాల్గొన్న భక్తులు మారణహోమానికి పాల్పడిన సాయుధ పోలీసులను ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడిన దినం అది. ఆ బ్రిటిష్ పోలీసుల పోరాటం లో చాల మంది ప్రాణాలు కోల్పోయారు . ఆ పోరాటం లో ప్రాణాలు కోల్పోయిన వీరుల కోసం ఏర్పాటు చేసిన స్మారక స్తూపం కోనసీమ తిరుమల వాడపల్లి లో నేటికి ఉంది . ఈ పవిత్ర ప్రదేశంలో ఇదే వారి స్మారక చిహ్నం.

వాడపల్లి ఎలా చేరుకోవచ్చు ?
సమీప బస్సు స్టేషన్ : రావులపాలెం . రావులపాలెం నుండి కోనసీమ తిరుమల వాడపల్లి చేరుకోవడానికి ప్రతి అరకంటకు బస్సు లు నడపబడుతున్నవి . రాజమండ్రి నుండి వచ్చే వారు దవేలేశ్వరము , బొబ్బర్లంక రూటు దగ్గరగా ఉంటుంది .సమీప రైల్వే స్టేషన్ : రాజమండ్రి
సమీప ఎయిర్పోర్ట్ : రాజమండ్రి కోరుకొండ లో ఎయిర్పోర్ట్ కలదు .

కోనసీమ తిరుమల వాడపల్లి – పూజలు, సేవలు & దర్శన వేళలు
దర్శన వేళలు
- ప్రతిరోజూ: ఉదయం 6:00 – మధ్యాహ్నం 1:00 వరకు
- సాయంత్రం: 4:00 – రాత్రి 8:00 వరకు
- శనివారం: ఉదయం 4:00 – మధ్యాహ్నం 1:30 వరకు, సాయంత్రం 4:00 – రాత్రి 9:00 వరకు
అష్టోత్తర పూజ
- ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుంచి
- పూజ రుసుము: ₹150 (పాత సమాచారం — ప్రస్తుత రుసుము దేవస్థానంలో నిర్ధారించుకోండి)
కావలసిన వస్తువులు:
కొబ్బరికాయలు 2, అరటిపళ్లు 6, అగరువత్తులు 6, హారతికర్పూరం, విడి పువ్వులు, తులసిమాల, స్వయంపాకం మొదలైనవి.
వేదాశీర్వచనం
పాత సమాచారం ప్రకారం రుసుము ₹1,116. ఈ సేవలో దర్శనం, ఆశీర్వచనం, స్వామివారి శేషవస్త్రం, రవికల ముక్క, లడ్డు ప్రసాదం, అక్షింతలు, కుంకుమ, జూట్ బ్యాగ్ వంటి ప్రసాదాలు అందించబడతాయని పేర్కొనబడింది.
శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం
పాత సమాచారం ప్రకారం కళ్యాణోత్సవ రుసుము ₹750.
కావలసిన వస్తువులు: కొబ్బరికాయలు, అరటిపళ్లు, తమలపాకులు, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతికర్పూరం, విడి పువ్వులు, గంధం, వక్కలు, తేనె, ఆవుపాలు, బియ్యం మొదలైనవి.
నిత్య అన్నప్రసాదం
ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందని పాత సమాచారంలో పేర్కొనబడింది.
⚠️ ముఖ్య గమనిక
పైన పేర్కొన్న దర్శన వేళలు, సేవల రుసుములు మరియు ఇతర వివరాలు కాలానుగుణంగా మారవచ్చు. ఆలయానికి వెళ్లే ముందు ప్రస్తుత సమయాలు, సేవల రుసుములు మరియు నియమాలను దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ లేదా ఆలయ అధికారులను సంప్రదించి నిర్ధారించుకోండి.
కోనసీమ తిరుమల వాడపల్లి – ఏడు శనివారాల దర్శన విశేషం
“ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.” ప్రారంభించే మొదటి శనివారం ధ్వజస్థంభం వద్ద నిలబడి మీ మనస్సులోని కోరికను ఆ స్వామివారికి నివేదించుకుని ‘ 7 ‘ సార్లు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవలెను. భక్తులకు ఆలయమున కు రాకూడని అడ్డంకి కలిగినచో అడ్డంకి తొలగిన తదుపరి వారములు కొనసాగించవచ్చును. “ 7 ” శనివారములు వాడపల్లి వెంకన్న దర్శనం అనంతరం మీ యొక్క జన్మ నక్షత్ర రీత్యా సాధన తార, తిధి రోజున శ్రీ స్వామి వారికి అష్టోత్తరం, శాంతి కళ్యాణం జరిపించిన కొరిన కోరిక సిద్ధించి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని భక్తుల విశ్వాసం. ఇది కోనసీమ తిరుమల – వాడపల్లి విశేషం .
ముగింపు
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి గోదావరి జిల్లా ల నుండే కాకుండా ఇతర జిల్లాల వారు , ఇతర రాష్ట్రాల వారు నిత్యం వందలాది భక్తులు వస్తుంటారు . శని వారం అయితే సుమారు 50 వేల నుండి లక్ష మంది ఆ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు .
చాల మంది భక్తులు తమ కోరిన కోర్కెలు తీరిన తర్వాత ఏడూ శనివారాలు స్వామి వారి ప్రదక్షిణ చేయడం తో శనివారం ఈ దేవాలయం భక్తులతో రద్దీగా ఉంటుంది . శనివారం కాకుండా మిగతా రోజుల్లో దర్శనం కొంచెం త్వరగా అవుతుంది . ఇక్కడికి వచ్చే భక్తుల కోసం దేవాలయం లో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది . మీరు వీలయినప్పుడు కోనసీమ లోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి ని దర్శించుకోండి !
కోనసీమలో మరిన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలు
కోనసీమలోని మరిన్ని ప్రసిద్ధ దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మా ఇతర కథనాలను కూడా చదవండి:
- పలివెల పురాతన శివాలయం – చారిత్రక విశేషాలు
- అయినవిల్లి శ్రీ వినాయక స్వామి ఆలయం – వీడియోలో చూడండి.
దేవస్థానం అధికారిక సమాచారం
మరిన్ని వివరాల కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, కోనసీమ తిరుమల – వాడపల్లి అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి:
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్
చిరునామా:
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, వాడపల్లి, ఆత్రేయపురం మండలం, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.
ఫోన్: +91 88552 71888, +91 94910 00085
ప్రభుత్వ దేవాలయాల సమాచారం:
AP Temples అధికారిక వెబ్‌సైట్
గమనిక: ఫోన్ నంబర్లు, సేవల రుసుములు, దర్శన వేళలు వంటి వివరాలు మారే అవకాశం ఉన్నందున ఆలయాన్ని సంప్రదించి నిర్ధారించుకోవడం మంచిది.










