ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ: ఆంధ్రుల అన్నపూర్ణగా ఎలా మారారు?

Table of Contents

డొక్కా సీతమ్మ – ఆంధ్రుల అన్నపూర్ణ

బ్రిటిష్ పాలన కాలంలోనే ఆకలితో ఉన్నవారికి నిరంతరం అన్నదానం చేస్తూ, తన సేవా గుణంతో ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళ డొక్కా సీతమ్మ. 1841లో మండపేట ప్రాంతంలో జన్మించిన ఆమె, జీవితంలో పెద్ద భాగాన్ని పేదలు, ప్రయాణికులు మరియు ఆకలితో వచ్చిన వారికి ఆహారం అందించడానికే అంకితం చేశారు. ఆమెకు కులం, మతం, ధనిక–పేద అనే తేడా లేకుండా ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజనం పెట్టే అలవాటు ఉండేదని పలు జీవితచరిత్రలు పేర్కొంటున్నాయి.

ఆమె నిస్వార్థ అన్నదాన సేవ కారణంగా “ఆంధ్రుల అన్నపూర్ణ”, “అపర అన్నపూర్ణ” వంటి పేర్లతో ప్రజల గౌరవాన్ని పొందారు. బ్రిటిష్ పాలనలో కూడా ఆమె సేవల గురించి అధికార వర్గాలకు తెలిసినట్లు పలు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి.

డొక్కా సీతమ్మ జీవితం కేవలం అన్నదాన కథ మాత్రమే కాదు; సేవ, దాతృత్వం మరియు ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలనే మానవతా విలువలకు ఒక ఉదాహరణగా గుర్తుండిపోయింది.

కోనసీమలోని సంప్రదాయాలు, ఆహార సంస్కృతి గురించి మరింత తెలుసుకోవాలంటే మా సైట్‌లోని కోనసీమ ప్రత్యేక రుచులు కూడా చూడవచ్చు.

Dokka -Setamma-Konaseema
Dokka -Setamma-Konaseema

డొక్కా సీతమ్మ గారి చరిత్ర    

లంకలగన్నవరం – సీతమ్మ అన్నదాన సేవకు నిలయమైన గ్రామం

ఆంధ్రప్రదేశ్‌లోని బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గన్నవరం మండలానికి చెందిన లంకలగన్నవరం గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ఒక గ్రామం. ప్రకృతి అందాలతో పాటు డొక్కా సీతమ్మ జీవితంతో ముడిపడిన ప్రత్యేక చరిత్ర కూడా ఈ గ్రామానికి ఉంది.

ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రయాణాలు ప్రధానంగా పడవలు, ఎడ్లబండ్లు, కాలినడక ద్వారా సాగేవి. గన్నవరం వరకు చేరుకున్న ప్రయాణికులు గోదావరి నదిని పడవల ద్వారా దాటి రాజోలు, అంతర్వేది తదితర ప్రాంతాలకు వెళ్లేవారు.

ప్రయాణంలో ఆలస్యం జరిగి చీకటి పడినప్పుడు, గోదావరి దాటిన తర్వాత ప్రయాణికులకు రాత్రి బస, భోజనం వంటి సౌకర్యాలు పెద్ద సమస్యగా ఉండేవి.  అలాంటి సమయంలో లంకలగన్నవరంలోని డొక్కా సీతమ్మ ఇంటికి చేరుకున్న ప్రయాణికులు అక్కడే రాత్రి బస చేసి, ఆమె అందించే అన్నదానం స్వీకరించి మరుసటి రోజు తమ ప్రయాణాన్ని కొనసాగించేవారని స్తానికులు చెబుతారు .

ఆకలితో వచ్చినవారికి, ప్రయాణికులకు, పేదలకు ఆమె ఎలాంటి భేదభావం లేకుండా భోజనం పెట్టేవారని చెబుతారు. ఈ నిస్వార్థ అన్నదాన సేవ కారణంగానే సీతమ్మను “అన్నదాన సీతమ్మ”గా ప్రజలు గౌరవంగా గుర్తుచేసుకుంటారు.

డొక్కా సీతమ్మ గారి ఇల్లు లంకలగన్నవరం
డొక్కా సీతమ్మ గారి ఇల్లు లంకలగన్నవరం

సీతమ్మ గారి బాల్యం, వివాహం

డొక్కా సీతమ్మ గారు 1841లో మండపేటలో అనుపిండి భవానీ శంకరం గారు, శ్రీమతి నరసమ్మ దంపతులకు జన్మించారు. భవానీ శంకరం గారు అన్నదానం, ఇతరులకు సహాయం చేయడంలో ముందుండేవారు. అన్నం పెట్టే వ్యక్తిగా ఆయనను స్థానికులు ప్రేమగా “బువన్న” అని పిలిచేవారని చెబుతారు. చిన్నతనం నుంచే తండ్రి చేసే అన్నదాన కార్యక్రమాలను చూసిన సీతమ్మ గారు కూడా అదే సేవా మార్గాన్ని అలవర్చుకున్నారు.

చిన్నప్పటి నుంచే సీతమ్మ గారికి దయ, జాలి, అతిథులను ఆదరించే స్వభావం ఉండేది. వివాహం తరువాత కూడా ఆమె ఆ సేవాగుణాన్ని కొనసాగించారు.

డొక్కా జోగన్న పంతులుతో వివాహం

లంకలగన్నవరానికి చెందిన వేదపండితుడు, పెద్ద రైతు డొక్కా జోగన్న పంతులు గారు ఒకసారి వేదపండితుల సభకు వెళ్లి తిరిగి వస్తుండగా మండపేటలో మధ్యాహ్న భోజన సమయం అయింది. ఆ సమయంలో భవానీ శంకరం గారి ఆహ్వానం మేరకు ఆయన వారి ఇంటికి వెళ్లి భోజనం చేశారు.

ఆ సమయంలో సీతమ్మ గారి వినయం, పెద్దల పట్ల గౌరవం, అతిథులను ఆదరించే తీరు జోగన్న పంతులుగారిని ఆకట్టుకున్నాయని కథనాలు చెబుతున్నాయి. అనంతరం సీతమ్మ గారితో ఆయన వివాహం 1850లో జరిగింది.

మెట్టినింట అడుగుపెట్టిన తరువాత కూడా సీతమ్మ గారు తన ఉదార స్వభావాన్ని, సేవాగుణాన్ని కొనసాగించారు. కాలక్రమేణా ఆమె చేసే అన్నదానం, దానధర్మాలు లంకలగన్నవరం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో వారి కుటుంబానికి మంచి పేరు తీసుకువచ్చాయి.

ఆకలితో వచ్చినవారికి అన్నం పెట్టిన తల్లి

వరదల్లోనూ ఆగని అన్నదానం

గోదావరి తీర ప్రాంతాలు అప్పట్లో తరచూ వరదల బారిన పడేవి. వరదల సమయంలో ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు డొక్కా సీతమ్మ గారు తన భర్త డొక్కా జోగన్న పంతులు గారి సహకారంతో అన్నం వండి ఆకలి తీర్చేవారని గ్రామస్తులు  చెబుతున్నారు .

సీతమ్మ గారి ఇంట్లో ఎప్పుడూ వంట కొనసాగుతుండేదని, ఎవరైనా ఆకలితో వస్తే వారికి భోజనం పెట్టేందుకు ఆమె సిద్ధంగా ఉండేవారని చెబుతారు. పేదవారైనా, ధనవంతులైనా ఆమె అందరినీ ఒకే విధంగా ఆదరించేవారు.

ఆ రోజుల్లో రాజోలు, అంతర్వేది వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు లంకలగన్నవరం రేవు మీదుగా గోదావరి దాటేవారు. ప్రయాణంలో ఆకలిగా ఉన్నవారు సీతమ్మ గారి ఇంటికి చేరుకుంటే, ఆమె వారిని ఆప్యాయంగా ఆహ్వానించి భోజనం పెట్టేవారని కథనాలు పేర్కొంటున్నాయి. ఆమె భర్త జోగన్న పంతులు గారు కూడా అన్నదానానికి అవసరమైన సరుకులను సమకూర్చడంలో పూర్తి సహకారం అందించేవారు.

ప్రయాణికుల కోసం తిరిగి వచ్చిన సీతమ్మ

అంతర్వేది ఉత్సవాల సమయంలో ఒకసారి సీతమ్మ గారు వేరే ప్రాంతానికి ప్రయాణమయ్యారట. మార్గమధ్యంలో కొంతమంది ప్రయాణికులు “ఈ రోజు చీకటి పడిన తర్వాత లంకలగన్నవరంలో డొక్కా సీతమ్మ గారి ఇంటి భోజనం చేసి కడుపు నింపుకోవాలి” అని మాట్లాడుకోవడం ఆమె విన్నారని స్థానికంగా చెప్పుకునే కథనం ఉంది.

ఆ మాటలు విన్న సీతమ్మ గారు తన ప్రయాణాన్ని విరమించుకుని తిరిగి ఇంటికి వచ్చి, ప్రయాణికుల కోసం ముందుగానే వంట సిద్ధం చేశారని చెబుతారు.

ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేని సందర్భాల్లో కూడా గరిక గడ్డితో పచ్చడి తయారు చేసి వడ్డించేవారని కోనసీమలోని  గ్రామస్తులు కధలుగా చెబుతుంటారు .

డొక్కా సీతమ్మ సేవలకు వచ్చిన గౌరవం

బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ VII దృష్టిని ఆకర్షించిన అన్నదానం

డొక్కా సీతమ్మ గారి అన్నదాన సేవలు కోనసీమ ప్రాంతంలోనే కాకుండా బ్రిటిష్ పాలనలోని అధికార వర్గాల దృష్టిని కూడా ఆకర్షించాయని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. కులమతాలకు అతీతంగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే సీతమ్మ గారి సేవాగుణం గురించి బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ VIIకి తెలిసిందని పేర్కొంటారు.

1903లో తన పట్టాభిషేక కార్యక్రమానికి ఇంగ్లాండ్ రావాలని సీతమ్మ గారికి ఆహ్వానం పంపించారని, అయితే సముద్ర ప్రయాణం చేయడం ఇష్టం లేక ఆమె ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారని కథనాలు చెబుతున్నాయి.

అనంతరం సీతమ్మ గారి ఫోటోను పంపించాలని బ్రిటిష్ చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు చెబుతారు. అధికారులు ఫోటో కోసం సీతమ్మ గారి వద్దకు వెళ్లగా, మొదట ఆమె ఫోటో తీయించుకోవడానికి అంగీకరించలేదని స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం.

అధికారులు తమ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుందని విజ్ఞప్తి చేయడంతో చివరకు సీతమ్మ గారు ఫోటో తీయించుకోవడానికి అంగీకరించారని చెబుతారు.

ఆ తరువాత ఎడ్వర్డ్ VII పట్టాభిషేక సమయంలో సీతమ్మ గారి చిత్రపటానికి గౌరవం చూపించారని, పట్టాభిషేకం అనంతరం ఆమెకు పంపిన ప్రశంసా పత్రంలో ఈ విషయాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని కథనాలు పేర్కొంటున్నాయి.  నేను లంకల గన్నవరం వెళ్ళినప్పుడు వారి కుటుంబీకులు చూపిన   గవెర్నమెంట్ అఫ్  మద్రాస్ వారు పంపిన  సర్టిఫికేట్  కాపీ ఫోటో ఇది .

డొక్కా సీతమ్మ గురించి పుస్తకాల్లో ఉన్న చారిత్రక సమాచారం
డొక్కా సీతమ్మ జీవితం, సేవలకు సంబంధించిన పుస్తకాలలోని సమాచారం

డొక్కా సీతమ్మ సేవలకు లభించిన గుర్తింపు

కోనసీమలో డొక్కా సీతమ్మ గారి సేవలను గుర్తు చేసుకుంటూ 2000 సంవత్సరంలో గన్నవరం వద్ద గోదావరి నదిపై నిర్మించిన వంతెనకు “డొక్కా సీతమ్మ వారధి” అని పేరు పెట్టారు. ఈ వారధి ద్వారా నిత్యం ప్రయాణించే ప్రజలకు ఆమె పేరు స్మరణలో ఉండేలా ఈ పేరు పెట్టడం విశేషం. డొక్కా సీతమ్మ వారధి గురించి మరిన్ని వివరాలు కూడా చూడవచ్చు.

ఆమె చేసిన అన్నదాన సేవలకు గౌరవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం” అని పేరు పెట్టింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

నా పాఠశాల రోజుల్లో డొక్కా సీతమ్మ కథ

నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో డొక్కా సీతమ్మ గారి కథను తెలుగు పాఠంగా చదివాను. 1980–85 మధ్యకాలంలో ప్రాథమిక పాఠశాలలో ఈ పాఠం నాకు గుర్తుంది. చిన్నప్పుడే ఆమె చేసిన అన్నదాన సేవ గురించి పాఠ్యపుస్తకం ద్వారా తెలుసుకున్నాను. ఆ రోజుల్లో పాఠంగా చదివిన డొక్కా సీతమ్మ గారి కథను, ఇప్పుడు ఆమె గురించి రాస్తున్నప్పుడు మళ్లీ గుర్తు చేసుకోవడం నాకు ప్రత్యేకమైన అనుభూతి.

Dokka Sethamma varadhi
Dokka Sethamma varadhi

కోనసీమ లో నేటికి  సీతమ్మ గారి ఇల్లు

లంకలగన్నవరంలోని డొక్కా సీతమ్మ గారి ఇంటిని నేను స్వయంగా సందర్శించాను. ఇంటి లోపల ఉన్న బావిని, ఆమె ఉపయోగించినట్లు చెబుతున్న పాత వస్తువులు, వంట సామాన్లను ప్రత్యక్షంగా చూశాను. ఆమె వారసులు ఈ వస్తువులను ఇప్పటికీ భద్రపరిచారు.

సీతమ్మ గారి అన్నదాన సేవలను గుర్తు చేసుకునే ఈ ఇల్లు గ్రామ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఆమె జీవితం, అన్నదాన సేవల గురించి తెలుసుకోవడంతో పాటు, ఆమె జ్ఞాపకాలకు సంబంధించిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు లంకలగన్నవరం గ్రామాన్ని సందర్శించవచ్చు.

సీతమ్మ గారి ఇల్లు ఎలా చేరుకోవాలి?

🚗 రాజమహేంద్రవరం నుంచి

రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం మీదుగా గన్నవరం చేరుకుని, గన్నవరం వంతెన దాటి లంకలగన్నవరం చేరుకోవచ్చు.

🚗 అమలాపురం నుంచి

అమలాపురం నుంచి రోడ్డు మార్గంలో లంకలగన్నవరం చేరుకోవచ్చు. దూరం సుమారు 18 కిలోమీటర్లు.

🚗 పాలకొల్లు – రాజోలు మార్గం

పాలకొల్లు నుంచి రాజోలు మీదుగా లంకలగన్నవరం చేరుకోవచ్చు. పాలకొల్లు నుంచి గన్నవరం వరకు దూరం సుమారు 35 కిలోమీటర్లు.

గమనిక: రోడ్డు మార్గం, స్థానిక పరిస్థితులను బట్టి దూరం మరియు ప్రయాణ సమయం మారవచ్చు. ప్రయాణానికి ముందు స్థానికంగా మార్గాన్ని నిర్ధారించుకోవడం మంచిది.

ముగింపు

కులమతాలకు అతీతంగా ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టడం, తన దగ్గర ఉన్నదాన్ని అవసరమైన వారితో పంచుకోవడం డొక్కా సీతమ్మ గారి జీవితంలో ముఖ్యమైన విలువలు. ఆమె చేసిన అన్నదాన సేవలు కోనసీమ ప్రాంతానికే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా పరిచయమై, ఆమెకు ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకువచ్చాయి.

సీతమ్మ గారి జీవితం మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తుంది. మన దగ్గర ఉన్నదాంట్లో కొంతైనా అవసరమైన వారికి పంచడం కూడా గొప్ప మానవతా సేవే అని ఆమె జీవితం గుర్తుచేస్తుంది. అందుకే డొక్కా సీతమ్మ పేరు నేటికీ ప్రజల జ్ఞాపకాల్లో, కోనసీమ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.

కోనసీమలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి మరింత తెలుసుకోవాలంటే మా సైట్‌లోని అంతర్వేది క్షేత్రం గురించి కూడా చదవవచ్చు.

 

Related Post

Leave a Comment