కేశనపల్లి గ్రామం విశేషాలు – సినిమాల నుంచి సంప్రదాయ సంత వరకు పూర్తి సమాచారం

By konaseema life

Published On:

కేశనపల్లి గ్రామం

 

సినిమా షూటింగ్‌లకు ప్రసిద్ధి చెందిన కేశనపల్లి

 అంబేద్కర్ కోనసీమ జిల్లా లో  ఉన్న అందమైన పల్లెటూరు   కేశనపల్లి  గ్రామం  . ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, సినిమా చిత్రీకరణలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. గ్రామంలోని ఉప్పుటేరులు, పచ్చని కొబ్బరి తోటలు, ప్రశాంతమైన పల్లె వాతావరణం దర్శకులను ఎంతగానో ఆకర్షించాయి.

కెమెరాకు ఎంతో అందంగా కనిపించే ఈ ప్రకృతి ప్రదేశాలు అనేక సినిమాలకు నేపథ్యంగా నిలిచాయి. ముఖ్యంగా గోదావరి ప్రాంత గ్రామీణ జీవనశైలిని, ప్రేమ కథలను, పల్లె అందాలను చూపించడానికి కేశనపల్లి అనువైన ప్రదేశంగా మారింది.

నటుడు వెంకటేష్, మీనా నటించిన ప్రముఖ చిత్రం “చంటి” సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ గ్రామంలోని ఉప్పుటేరులు, కొబ్బరి తోటల్లో చిత్రీకరించారు.

అలాగే ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన “సింధూరం” సినిమా, నటుడు అల్లరి నరేష్ నటించిన “బెట్టింగ్ బంగార్రాజు”, దర్శకుడు వంశీ రూపొందించిన “అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు” వంటి సినిమాల చిత్రీకరణలు కూడా కేశనపల్లి గ్రామంలో జరిగాయి.

అంతేకాకుండా పలు టెలిఫిల్మ్స్, టీవీ కార్యక్రమాల చిత్రీకరణలకు కూడా ఈ గ్రామం వేదికగా నిలిచింది.

ప్రముఖ దర్శకుడు కె. మహేష్ (రథం సినిమా దర్శకుడు) స్వగ్రామం కూడా కేశనపల్లి కావడం ఈ గ్రామానికి మరో ప్రత్యేకత.

ప్రకృతి అందాలను ప్రేమించే దర్శకులకు కేశనపల్లి ఒక సహజమైన సినిమా సెట్టింగ్‌లా కనిపిస్తుంది.

Kesanapalli post office
Kesanapalli post office

కేశనపల్లి గ్రామ విద్యా విశేషాలు

గ్రామ అభివృద్ధిలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కేశనపల్లి గ్రామంలో 1951 సంవత్సరంలోనే ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడం విశేషం.

ఆ కాలంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నత పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో, విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. ముఖ్యంగా పూర్వం హైస్కూల్ విద్య కోసం సమీపంలోని పొన్నమండ గ్రామానికి వెళ్లేవారని గ్రామ పెద్దలు చెబుతున్నారు.

ప్రస్తుతం కేశనపల్లి గ్రామంలో ఉన్నత పాఠశాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు ఉన్నత విద్య మరింత సులభమైంది.

కేశనపల్లి హైస్కూల్ ప్రాంగణం విశాలంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పెద్ద ఆట స్థలం, చెట్లతో నిండిన ప్రశాంతమైన వాతావరణం విద్యార్థులకు మంచి అభ్యాస వాతావరణాన్ని అందిస్తోంది.

ఇలాంటి పాత విద్యాసంస్థలు ఒక గ్రామ చరిత్రలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎన్నో తరాల విద్యార్థులకు ఈ పాఠశాల జ్ఞానాన్ని అందించింది.

Kesanapalli High school
Kesanapalli High school

కేశనపల్లి వ్యవసాయ వైభవం

కోనసీమ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చని వ్యవసాయ భూములు, కొబ్బరి తోటలు. కేశనపల్లి గ్రామం కూడా దీనికి మినహాయింపు కాదు.

ఈ గ్రామంలో ప్రధానంగా:

  • కొబ్బరి తోటలు
  • మామిడి తోటలు
  • జీడి మామిడి తోటలు
  • సరుగుడు తోటలు

ఎక్కువగా కనిపిస్తాయి.

ముఖ్యంగా ఇక్కడ పండే కొబ్బరికి మంచి డిమాండ్ ఉంది. కేశనపల్లి ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికాయలు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతాయి.

రైతులు తమ పంటలను దూర ప్రాంత మార్కెట్లకు పంపిస్తూ జీవనాధారం పొందుతున్నారు.

అయితే గత కొంతకాలంగా ప్రకృతి మార్పులు, సముద్ర ప్రభావం, ఉప్పునీటి సమస్యలు, కొన్ని పారిశ్రామిక కార్యకలాపాల ప్రభావం కారణంగా కొబ్బరి సాగు కొంత తగ్గుతోందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉప్పునీరు భూముల్లోకి చేరడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు దెబ్బతింటున్నాయని రైతులు చెబుతున్నారు.

Coconut Grading
Coconut Grading

కేశనపల్లి తాజా చేపల మార్కెట్ ప్రత్యేకత

సముద్రానికి సమీపంగా ఉండటం, గోదావరి పాయల నుంచి వచ్చే ఉప్పుటేరులు ఉండటం వల్ల కేశనపల్లి గ్రామంలో చేపల లభ్యత ఎక్కువగా ఉంటుంది.

ప్రతి రోజు ఉదయం వేళల్లో కేశనపల్లి వంతెన సమీపంలోని కాలువ ప్రాంతంలో తాజా చేపల అమ్మకాలు జరుగుతుంటాయి.

స్థానికంగా లభించే చేపల్లో:

  • శీలావతి చేపలు
  • కోయ్యింగలు
  • పచ్చిరొయ్యలు
  • ఇతర సముద్రపు చేపలు

ప్రధానమైనవి.

ఉదయం పూట ఇక్కడ చేపల మార్కెట్ సందడిగా కనిపిస్తుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాజా చేపల కోసం ఇక్కడికి వస్తుంటారు.

సముద్రం నుంచి నేరుగా వచ్చిన తాజా చేపలు అందుబాటులో ఉండటం ఈ ప్రాంత మార్కెట్ ప్రత్యేకత.

kesanapalli fish market
kesanapalli fish market

కేశనపల్లి వారపు సంత – పాత జ్ఞాపకాలను గుర్తుచేసే సంప్రదాయం

గ్రామీణ జీవితంలో వారపు సంతలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

ఒకప్పుడు గ్రామాల్లో జరిగే సంతలు ప్రజల కలయికకు, వ్యాపారానికి, వినోదానికి కేంద్రాలుగా ఉండేవి. పిల్లలు సంత రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు.

తల్లిదండ్రులు లేదా తాతలు తీసుకొచ్చే చిన్న చిన్న తినుబండారాల కోసం పిల్లలు ఎదురు చూసే రోజులు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి.

అలాంటి పాత సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తున్న గ్రామాల్లో కేశనపల్లి కూడా ఒకటి.

ఇక్కడ ప్రతి సోమవారం వారపు సంత జరుగుతుంది.

ఈ సంతలో స్థానిక వ్యాపారులు అక్కడికక్కడే తయారు చేసే చిరుతిళ్లు, గ్రామీణ వంటకాలు వేడివేడిగా అమ్ముతుంటారు.

నేటి కాలంలో షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు   పెరగడంతో వారపు సంతలకు వచ్చే వారి సంఖ్య కొంత తగ్గినప్పటికీ, గ్రామీణ జీవన సువాసనను ఆస్వాదించాలనుకునే వారికి ఈ సంతలు ఇప్పటికీ ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి.

మలికిపురం  మండలం లో ఉన్న ఈ   కేశనపల్లి గ్రామం చేరుకోవాలంటే  రాజోలు , మలికిపురం నుండి చేరుకోగలరు .  మా  ” కేశనపల్లి మినీ కేరళ ”  అనే పోస్ట్ ద్వారా మరింత సమాచారం తెలుసుకో గలరు

kesanapalli market 1
kesanapalli market 1

 

కేశనపల్లి బీచ్, వ్యవసాయం,  సినిమా చిత్రీకరణ ప్రదేశాలు  మరియు సమీప పర్యాటక ఆకర్షణలపై ప్రత్యేక కథనాలకు క్రింద  మా  వెబ్ సైట్  ను సందర్శించండి.

కోనసీమలోని ప్రసిద్ధ ఆలయాల దర్శన విశేషాలు, ఉత్సవాలు మరియు ప్రయాణ సమాచారాన్ని తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన లింకులను చూడండి.

వాడపల్లి         అయినవిల్లి       పలివెల     అంతర్వేది        మురముళ్ళ        పట్టిసీమ 

 

Related Post

Leave a Comment