గోదావరి స్టైల్ గోంగూర రొయ్యల కూర తయారీ విధానం (Step-by-Step Recipe)
ఆంధ్రా వంటకాల్లో గోంగూర రొయ్యల కూరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పుల్లటి గోంగూరతో కమ్మటి రొయ్యలు కలిసి ఉడికినప్పుడు వచ్చే ఆ రుచే వేరు. ముఖంగా మసాలాలు ఎక్కువగా ఇష్టపడని వారికి, సహజమైన రుచులను ఆస్వాదించాలనుకునే వారికి ఈ వంటకం ఒక వరమనే చెప్పాలి.
మన గోదావరి జిల్లాల్లో ఈ వంటకాన్ని చాలా సాంప్రదాయ పద్ధతిలో, ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా గరం మసాలా వాడకుండా వండుతారు.గోదావరి జిల్లాల్లో అసలైన గోదావరి పులస చేపల పులుసు కి ఎంత క్రేజ్ ఉందో, అంతే డిమాండ్ ఈ గోంగూర రొయ్యల కూరకి కూడా ఉంటుంది. ఈ రోజు ఈ బ్లాగ్ పోస్ట్‌లో నోరూరించే పక్కా గోదావరి స్టైల్ గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో స్టెప్-బై-స్టెప్ విధానంలో తెలుసుకుందాం.
గోదావరి స్టైల్ గోంగూర రొయ్యల కూర ప్రత్యేకత ఏంటి?
గోదావరి జిల్లాల నది పాయలలోని స్వచ్ఛమైన నీటిలో దొరికే రొయ్యలు, తోటల్లో పండే తాజా గోంగూర కలిపి వండే వంటకం చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా కోనసీమలోని వసిష్ట, గౌతమి, వైనతేయ నది పాయలలో సహజసిద్ధంగా పెరిగే తాజా రొయ్యలు ఇక్కడ లభిస్తుంటాయి. ఈ పచ్చి రొయ్యలకు, గోంగూరకు ఉండే కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. రుచిలో ఎంతో అద్భుతంగా ఉంటూ, ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపించే అద్భుతమైన వంటకమే ఈ గోదావరి స్టైల్ గోంగూర రొయ్యల కూర.
ఈ కూరలో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ గానీ, ఘాటైన మసాలాలు గానీ వాడరు. కేవలం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చిల తాలింపు సువాసనే ఈ వంటకానికి అసలైన ఆత్మ. రొయ్యలలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇది శరీరానికి మంచి పోషకాలను అందించే ఒక కమ్మని ప్రోటీన్ రిచ్ ఫుడ్ (Protein-Rich Food). ఇటు రుచికి రుచి, అటు శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఈ సాంప్రదాయ వంటకం ప్రతి ఒక్కరూ తప్పక రుచి చూడాల్సిందే.
గోంగూర రొయ్యల కూరకి కావలసిన పదార్థాలు (Ingredients)
ఈ సాంప్రదాయ వంటకాన్ని పర్ఫెక్ట్గా వండటానికి కింద పేర్కొన్న తాజా పదార్థాలను సిద్ధం చేసుకోండి:
- తాజా రొయ్యలు: అర కిలో (లేదా మీ క్వాంటిటీని బట్టి)
- తాజా గోంగూర: 1 లేదా 2 కట్టలు (ఎర్ర గోంగూర అయితే పులుపు చాలా బాగుంటుంది)
- ఉల్లిపాయలు: 4 (సన్నగా తరిగినవి)
- పచ్చిమిర్చి: 6 (నిలువుగా చీల్చినవి)
- కారం: రుచికి సరిపడా
- పసుపు: అర చెంచా
- ఉప్పు: తగినంత
- నూనె: కూరకు సరిపడా
తాలింపు (పోపు) కోసం:
- ఆవాలు: అర చెంచా
- జీలకర్ర: అర చెంచా
- వెల్లుల్లి రెబ్బలు: 5 లేదా 6 (కచ్చాపచ్చాగా దంచినవి)
- ఎండుమిర్చి: 2 లేదా 3
- కరివేపాకు: రెండు రెమ్మలు

గోదావరి స్టైల్ గోంగూర రొయ్యల కూర లోకి సిద్దం చేసిన రొయ్యలు
రొయ్యలను క్లీన్ చేసుకునే విధానం (Preparation Tip)
రొయ్యల కూర వండేటప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడం అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. రొయ్యల సైజును బట్టి వాటిని క్లీన్ చేయడానికి కింద పేర్కొన్న చిట్కాలను పాటించండి:
- పెద్ద రొయ్యలు అయితే: రొయ్యలు పెద్దగా ఉంటే వాటి పైన ఉన్న పొట్టును (Shell) చాలా సులభంగా చేత్తోనే తీసేయవచ్చు.
- చిన్న రొయ్యల కోసం చిట్కా: చిన్న రొయ్యల పొట్టు తీయడం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కొన్నిసార్లు రొయ్యలు ముక్కలైపోతాయి కూడా. దీనికోసం ఒక చిన్న చిట్కా ఉంది. చిన్న రొయ్యలను ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో కొన్ని గోరువెచ్చని నీళ్లను పోసి, కేవలం 2 నిమిషాలు ఉంచితే పొట్టు చాలా సులువుగా ఊడి వచ్చేస్తుంది.
- నల్లటి నరాన్ని తొలగించడం (De-veining): పొట్టు తీసిన తర్వాత రొయ్య వెనుక భాగంలో నల్లగా ఉండే నరం లాంటి దానిని ఖచ్చితంగా తీసేయాలి. దీనికోసం ఒక చిన్న టూత్‌పిక్ (Toothpick) లేదా చాకు కొనను ఉపయోగిస్తే ఆ నరాన్ని ఎంతో ఈజీగా బయటకు తీసేయవచ్చు. ఈ నరాన్ని తీసేయడం వల్ల రొయ్యలు త్వరగా ఉడుకుతాయి మరియు తినేటప్పుడు బాగుంటాయి.
నీచు వాసన రాకుండా రొయ్యలను ఉడికించే విధానం
చాలామందికి రొయ్యల కూర వండేటప్పుడు నీచు వాసన వస్తుందనే భయం ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో చేస్తే నీచు వాసన అస్సలు ఉండదు:
- మొదటి స్టెప్: పొట్టు తొలగించిన రొయ్య పప్పును మంచి నీళ్లతో 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి, నీరంతా పిండేసి పక్కన ఉంచుకోవాలి.
- ఉడికించే విధానం: ఇప్పుడు స్టవ్ వెలిగించి, దాని మీద బాణలి (కడాయి) పెట్టాలి. బాణలి కాస్త వేడెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యల పప్పును అందులో వేయాలి.
- పసుపు వేయడం: దీనిలోనే కొద్దిగా పసుపు వేసి, మంటను సిమ్‌లో (Low flame) ఉంచి పచ్చి వాసన లేదా నీచు వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇందులో నూనె వేయనవసరం లేదు.
- రంగు మారడం: కొద్దిసేపటికి రొయ్యల్లోని సహజమైన నీరంతా బయటకు వచ్చి, రొయ్యలు చక్కగా చుట్టుకుంటూ ఎరుపు రంగులోకి మారడం మీరు గమనించవచ్చు. రొయ్యల్లోని నీరంతా ఇగిరిపోయే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
- లాభం: ఇలా ముందే ఉడికించి పెట్టుకోవడం వలన రొయ్యల నీచు వాసన పూర్తిగా పోవడమే కాకుండా, రొయ్య పప్పు చక్కగా గట్టిపడి కూర వండేటప్పుడు ముక్కలు అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది.

గోంగూర రొయ్యల కూర తయారీ విధానం (Step-by-Step Recipe)
గోంగూరను సిద్ధం చేసుకోవడం
- సాధ్యమైనంత వరకు లేత గోంగూర కట్టలను ఎంచుకోండి. ఆకులకు ఉన్న ఎర్రటి కాడలను తీసేసి కేవలం ఆకులను మాత్రమే వేరు చేయాలి.
- ఈ ఆకులను నీటితో శుభ్రంగా కడిగి ఇసుక, మలినాలు లేకుండా ఒక జల్లెడలో వేసి పక్కన పెట్టుకోవాలి.
గోంగూరను ఉడికించడం & మెదపడం
- స్టవ్ పైన బాణలి పెట్టి, ఒక కట్ట గోంగూరకు ఒక గ్లాసు చొప్పున నీరు పోసి అందులో కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేయాలి.
- ఆవిరి తగలగానే ఆకులన్నీ కుంచించుకుపోయి నీటిలో బాగా ఉడుకుతాయి. ఇలా 10 నుండి 12 నిమిషాలు ఉడికించిన తర్వాత ఆకులు మెత్తబడతాయి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఉడికిన గోంగూరలో మిగిలిన అదనపు నీటిని వడకట్టి తీసేయాలి. ఆ తర్వాత పప్పు గుత్తితో గోంగూర ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు, రొయ్యలు వేయించడం
- కూర వండటానికి వేరే బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
- నూనె కాగాక ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి.
- ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత, మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసి రెండు నుండి మూడు నిమిషాలు నూనెలో వేగనివ్వాలి. దీనివలన రొయ్యలు సాగకుండా తింటుంటే చాలా క్రిస్పీగా, ముక్క గట్టిగా తగులుతాయి.
కూరను ఉడికించడం
- రొయ్యలు నూనెలో కాస్త వేగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర పేస్టు ముద్దను అందులో వేయాలి.
- దాంతో పాటు కూర మొత్తానికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి రొయ్యల ముక్కలకు గోంగూర పట్టేలా బాగా కలపాలి.
- ఇప్పుడు ఒక గ్లాస్ నీరు పోసి, మూత పెట్టి మధ్యస్థ మంట మీద ఉడికించుకోవాలి. కూరలోని నీరంతా ఇగిరిపోయి, నూనె పైకి తేలి దగ్గరకు పడేవరకు ఉంచాలి.

గుమగుమలాడే తాలింపు (పోపు)
- కూర దగ్గరకు పడుతుండగా, తాలింపు కోసం స్టవ్ పై వేరే చిన్న బాణలి పెట్టి నూనె వేయాలి.
- నూనె మరిగిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా చిటపటలాడే వరకు వేగనివ్వాలి. వెల్లుల్లి కాస్త ఎర్రగా వేగితే సువాసన అద్భుతంగా వస్తుంది.
- ఈ వేడివేడి పోపును పక్కన ఉడుకుతున్న గోంగూర రొయ్యల కూరలో వేసి, వెంటనే మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. దీనివల్ల తాలింపులోని వెల్లుల్లి, కరివేపాకు సువాసనలు కూరకు బాగా పడతాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే! ఎంతో సులభంగా, సువాసనలతో నోరూరించే గోదావరి స్పెషల్ గోంగూర రొయ్యల కూర రెడీ.
గమనిక: మధ్యాహ్న భోజనంలోకి ఈ గోంగూర రొయ్యల కూరని ఎంజాయ్ చేసే ముందు, ఉదయాన్నే కోనసీమ ట్రెడిషనల్ బ్రేక్‌ఫాస్ట్ అయిన పనస ఆకుల పొట్టిక్కలు (Pottikkalu) రుచి చూడాలనుకుంటే మా ఈ ప్రత్యేకమైన రెసిపీని కూడా ఒకసారి చెక్ చేయండి!
రొయ్యల కూర మరింత రుచిగా రావడానికి చిట్కాలు (Cooking Tips)
ఈ వంటకాన్ని మరింత పర్ఫెక్ట్గా వండటానికి మరియు వండేటప్పుడు వచ్చే కొన్ని సాధారణ సందేహాలకు సమాధానాలు ఇక్కడ చూద్దాం:
- గోంగూర పులుపు ఎక్కువైతే ఏం చేయాలి?
కొన్నిసార్లు ఎర్ర గోంగూర వాడటం వల్ల కూరలో పులుపు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదు. పులుపును బ్యాలెన్స్ చేయడానికి కూరలో మరికొంచెం కారం మరియు ఉప్పును జత చేయవచ్చు. లేదా ఉల్లిపాయలను విడిగా నూనెలో దోరగా వేయించి, ఆ ఉల్లిపాయ ముద్దను కూరలో కలిపితే పులుపు విరిగి కూర రుచి చాలా బాగుంటుంది. - రొయ్యలు రబ్బరులా అవ్వకుండా ఉండాలంటే ఎంతసేపు ఉడికించాలి?
రొయ్యలను మరీ ఎక్కువ సేపు నూనెలో గానీ లేదా నీళ్లలో గానీ ఉడికిస్తే అవి రబ్బరులా సాగుతూ గట్టిగా అయిపోతాయి. అందుకే ఉల్లిపాయలు వేగిన తర్వాత రొయ్యలను వేసి కేవలం 2 నుండి 3 నిమిషాలు మాత్రమే నూనెలో వేగనివ్వాలి. ఆ తర్వాత గోంగూర పేస్ట్, నీళ్లు పోసి ఉడికించేటప్పుడు కూడా మీడియం మంట మీద 8 నుండి 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు. ఈ టైమింగ్స్ పాటిస్తే రొయ్య ముక్క లోపల జ్యూసీగా, తింటుంటే క్రిస్పీగా ఉంటుంది. - సర్వింగ్ సూచన (Serving Suggestion):
ఈ గోదావరి స్టైల్ గోంగూర రొయ్యల కూరను వేడివేడి అన్నంలో తింటే అమృతంలా ఉంటుంది. దీనికి నంజుకోవడానికి సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఉంటే ఆ మజానే వేరు. ఒకరోజు నిల్వ ఉన్న తర్వాత తింటే ఈ కూర ఇంకా ఎక్కువ రుచిని ఇస్తుంది.
మీరు కూడా ఈ సాంప్రదాయ పద్ధతిలో ఒకసారి గోంగూర రొయ్యల కూరను వండి చూడండి, మీ ఇంట్లో వాళ్లంతా లొట్టలేసుకుంటూ తింటారు!








