పలివెల 100 స్తంభాల శివాలయం: చరిత్ర, శిల్పకళ మరియు పూర్తి దర్శన వివరాలు

Table of Contents

పలివెల 100 స్తంభాల శివాలయం పరిచయం

ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, కొత్తపేట మండలంలోని పలివెల గ్రామంలో ఉన్న పలివెల 100 స్తంభాల శివాలయం చారిత్రక నిర్మాణశైలి, శైవ సంప్రదాయం మరియు ఆలయ ప్రాంగణంలోని రాతి నిర్మాణాలతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆలయాన్ని సందర్శించే వారికి ఇక్కడి పురాతన నిర్మాణశైలి, రాతి స్థంభాలు మరియు శిల్పాలను దగ్గరగా పరిశీలించే అవకాశం ఉంటుంది.

ఈ ఆలయం గురించి తెలుసుకోవాలనుకునే భక్తులు, కోనసీమలోని పురాతన దేవాలయాలను సందర్శించాలనుకునే ప్రయాణికులకు ఈ కథనం ఉపయోగపడేలా ఆలయ నిర్మాణం, స్థల విశేషాలు, దర్శనం, చేరుకునే మార్గం మరియు సమీపంలో లభించే వసతి వంటి ప్రయాణానికి అవసరమైన సమాచారాన్ని ఒకచోట అందిస్తున్నాం.

నేను ఆలయాన్ని సందర్శించినప్పుడు గమనించిన ప్రాంగణంలోని ముఖ్యమైన నిర్మాణాలు, రాతి స్థంభాలు మరియు ఇతర ప్రత్యేకతలను కూడా ఫోటోలతో వివరిస్తున్నాను. దీంతో ఈ ఆలయాన్ని మొదటిసారి సందర్శించేవారు ముందుగానే అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

కోనసీమలోని ఇతర ప్రసిద్ధ ఆలయాల గురించి కూడా తెలుసుకోవాలంటే మా అయినవిల్లి వినాయక స్వామి ఆలయం కథనాన్ని చూడవచ్చు.

పలివెల 100 స్తంభాల శివాలయం
పలివెల 100 స్తంభాల శివాలయం

పలివెల 100 స్తంభాల శివాలయం స్థలపురాణం – పూజారిగారు చెప్పిన ప్రకారం

పాలివెల ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయ పూజారిగారిని ఆలయ చరిత్ర, స్థలపురాణం గురించి అడిగి తెలుసుకున్నాను. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

పలవళం నుంచి పలివెల గా మారిన పేరు

పూజారిగారు చెప్పిన వివరాల ప్రకారం, పూర్వం ఈ ప్రాంతాన్ని పలవళం అని పిలిచేవారట. కాలక్రమంలో పలవళం అనే పేరు పలివెల గా మారిందని తెలిపారు.

అగస్త్య మహర్షికి సంబంధించిన స్థలపురాణం

ఆలయ స్థలపురాణం ప్రకారం అగస్త్య మహర్షి కాశీ పట్టణం నుంచి ఇక్కడికి వచ్చి కౌశికా నది తీరంలో తపస్సు చేశారని పూజారిగారు వివరించారు.

అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, శివలింగ రూపంలో అగస్తేశ్వర స్వామిగా, పార్వతీదేవి ఉమాదేవిగా ఒకే పీఠంపై స్వయంభువుగా వెలిశారని ఆలయ స్థలపురాణంలో చెబుతారని తెలిపారు.

ఆలయం ప్రాచీనమైనదని చెప్పే వివరాలు

పూజారిగారు తెలిపిన ప్రకారం, ఆరవ శతాబ్దానికి పూర్వమే ఇక్కడ స్వామివారు ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుందని చెప్పారు.

అలాగే పల్లవుల కాలంలో ఈ ప్రాంతాన్ని పలవులపురం అనే పేరుతో పిలిచేవారని కూడా వివరించారు.

పూర్వ రాజుల కాలంలో ఆలయానికి ఆదరణ

పూజారిగారు చెప్పిన వివరాల ప్రకారం, పల్లవులు, చాళుక్యులు, ప్రతాపరుద్రుడు, రాజరాజనరేంద్రుడు, పిఠాపురం మహారాజులు స్వామివారిని సేవించారని చెబుతారు.

ఆ కాలంలో ఆలయానికి పలు మండపాలు నిర్మించడంతో పాటు స్వామివారికి కానుకలు సమర్పించినట్లు ఆయన తెలిపారు.

ఉమా కొప్పులింగేశ్వర స్వామి పేరు ఎలా వచ్చింది?

పిఠాపురం మహారాజుల కాలానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనాన్ని కూడా పూజారిగారు వివరించారు.

ఆయన చెప్పిన ప్రకారం, పిఠాపురం మహారాజుల హయాంలో అగస్తేశ్వర స్వామి శివలింగంపై కొప్పు వెలిసిందట. అప్పటి నుంచి స్వామివారిని ఉమా కొప్పులింగేశ్వర స్వామి అనే పేరుతో పిలవడం ప్రారంభమైందని తెలిపారు.

ఈ పేరుకు సంబంధించి మరో స్థానిక కథనం కూడా ఉందని పూజారిగారు చెప్పారు. పిఠాపురం మహారాజుల కాలంలో ఆలయంలో 108 మంది దేవదాసీలను ప్రవేశపెట్టారని, వారిలో ఒక కన్యకు మరియు ఆలయ అర్చకుడికి సంబంధించిన సంఘటన కారణంగా స్వామివారు కొప్పు ధరించారని స్థానికంగా చెబుతారని వివరించారు.

ఇది ఆలయానికి సంబంధించిన స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనంగా పూజారిగారు వివరించారు.

స్వామివారికి భూమి ఇచ్చినట్లు చెప్పే వివరాలు

పూజారిగారు తెలిపిన మరో వివరాల ప్రకారం, పిఠాపురం మహారాజుల కాలంలో స్వామివారి సేవల కోసం గోపాలపురం సమీపంలోని గోదావరి లంకలో ఉన్న జుట్టుడుపాడు గ్రామంలో 100 ఎకరాల భూమిని స్వామివారికి ఇచ్చారని చెబుతారు.

ఈ వివరాలన్నింటినీ నేను ఆలయాన్ని సందర్శించిన సమయంలో పూజారిగారిని అడిగి తెలుసుకున్నాను.

ఆలయ నిర్మాణ ప్రత్యేకత

పలివెల 100 స్తంభాల శివాలయం ప్రాంగణంలో పురాతన రాతి నిర్మాణాలు, గోపురాలు, శిల్పకళా అంశాలు కనిపిస్తాయి. రాజగోపురం, గాలి గోపురం, ఉయ్యాల మండపం, స్వామివారి మండపం, నిత్యస్థాన మండపం, చిలుకు ద్వాదశ మండపం వంటి నిర్మాణాలు ఆలయ వాస్తు ప్రత్యేకతను తెలియజేస్తాయి.

ఆలయంలోని గ్రానైట్ రాతి స్తంభాలపై చెక్కిన చిన్న చిన్న శిల్పాలు, కళాకృతులు ప్రత్యేకంగా గమనించదగినవి. స్తంభాలను దగ్గరగా పరిశీలించినప్పుడు రాతిపై చేసిన పనితనం, వివిధ ఆకృతులు కనిపిస్తాయి. పురాతన కాలానికి చెందిన ఈ రాతి నిర్మాణాలు ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో కనిపించడం సందర్శకులకు చారిత్రక అనుభూతిని కలిగిస్తుంది.

ఆలయ ప్రాంగణంలో శిలాశాసనాలు కూడా ఉన్నాయి. వీటి చారిత్రక ప్రాధాన్యతకు సంబంధించిన వివరాలు ఆలయంలో ఏర్పాటు చేసిన పురావస్తు శాఖ సమాచార బోర్డులో పేర్కొనబడ్డాయి.

నేను ఆలయాన్ని సందర్శించిన సమయంలో  శిల్పాలు మరియు శాసనాలను ప్రత్యక్షంగా గమనించాను. వాటికి సంబంధించిన ఫోటోలను ఈ కథనంలో చేర్చాను. దీంతో పాఠకులు ఆలయ నిర్మాణంలోని ప్రత్యేక అంశాలను ఫోటోల ద్వారా కూడా గమనించవచ్చు.

పలివెల శివాలయం లోపల నుంచి గోపురం
పలివెల శివాలయం లోపల నుంచి గోపురం

పలివెల శివాలయంలో రాతి స్తంభాల విశిష్టత

పలివెల ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయంలో కనిపించే గ్రానైట్ రాతి స్తంభాలు ఆలయ నిర్మాణంలో ముఖ్యమైన ప్రత్యేకత. పురాతన కాలానికి చెందిన ఈ స్తంభాలపై చెక్కిన చిన్న చిన్న శిల్పాలు, కళాకృతులు ఇప్పటికీ గమనించవచ్చు. దగ్గరగా పరిశీలించినప్పుడు రాతిపై చేసిన పనితనం, వివిధ ఆకృతులు స్పష్టంగా కనిపిస్తాయి.

ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం, ఉయ్యాల మండపం, స్వామివారి నిత్యకళ్యాణ మండపం, నిత్యస్థాన మండపం, చిలుకు ద్వాదశ మండపం వంటి నిర్మాణాలతో పాటు వాటిలోని రాతి పనితనం ఆలయ ప్రాచీన నిర్మాణశైలిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

శిలాశాసనాల చారిత్రక ప్రాధాన్యత

పలివెల శివాలయ ప్రాంగణంలో కనిపించే శిలాశాసనాలు ఈ క్షేత్ర చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు. తూర్పు చాళుక్యుల కాలానికి సంబంధించిన శాసనాలు ఇక్కడ ఉన్నట్లు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పురావస్తు శాఖ సమాచార బోర్డులో పేర్కొనబడింది. అప్పటి కాలానికి సంబంధించిన చారిత్రక వివరాలను తెలుసుకోవడంలో ఇలాంటి శాసనాలకు ప్రాధాన్యత ఉంటుంది.

నేను ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ రాతి నిర్మాణాలు, శిల్పాలు మరియు శాసనాలను ప్రత్యక్షంగా గమనించాను. వాటికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ కథనంలో చేర్చాను. ఫోటోల్లో స్పష్టంగా కనిపించే నిర్మాణాలు, శిల్పాలనే వివరించాను .

ఈ చారిత్రక వివరాలను ఆలయ ప్రాంగణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురావస్తు శాఖ సమాచార బోర్డు ఆధారంగా అందిస్తున్నాం. పాఠకులు చారిత్రక సమాచారం మాత్రమే కాకుండా, ప్రస్తుతం ఆలయంలో కనిపించే నిర్మాణాలను కూడా ఫోటోల ద్వారా గమనించవచ్చు.

100 స్తంబాల శివాలయం లో శిలాశాసనాలు
100 స్తంబాల శివాలయం లో శిలాశాసనాలు

పలివెల గ్రామంలోని స్థానిక విశేషం

పలివెల గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్న ఒక ఆసక్తికరమైన విషయం గ్రామదేవతకు సంబంధించిన స్థానిక సంప్రదాయం. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం, గ్రామదేవతకు పుట్టినిల్లు, మెట్టినిల్లు అనే రెండు దేవాలయాలు ఒకే గ్రామంలో ఉన్నాయి. ఈ సంప్రదాయం పలివెల గ్రామానికి సంబంధించిన ప్రత్యేకమైన స్థానిక విశ్వాసంగా గ్రామస్తులలో కొనసాగుతోంది.

గ్రామంలోని మరో ప్రాంతంలో తాళ్లమ్మతల్లి దేవాలయం ఉంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, తాళ్లమ్మతల్లికి ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో స్థానిక భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు.

ఈ వివరాలను నేను పలివెల గ్రామాన్ని సందర్శించిన సమయంలో స్థానిక గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నాను. అందువల్ల వీటిని చారిత్రక ఆధారంగా కాకుండా స్థానికంగా కొనసాగుతున్న విశ్వాసం మరియు సంప్రదాయంగా ఈ కథనంలో అందిస్తున్నాను.

దేవాలయదర్శన సమయాలు

శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజలు, ప్రత్యేక అభిషేకాలు మరియు ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలనుకునే భక్తులు ఆలయ సిబ్బందిని ముందుగా సంప్రదించడం మంచిది.

నేను స్వయంగా తెలుసుకున్న  దర్శన సమయాలు  ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు,  అలాగే సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది.

పండుగలు, ప్రత్యేక ఉత్సవాలు మరియు ఇతర ముఖ్యమైన సందర్భాల్లో దర్శన, పూజా సమయాల్లో మార్పులు ఉండవచ్చు. దూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తులు ప్రయాణానికి ముందు ఆలయ సిబ్బందిని సంప్రదించి తాజా దర్శన సమయాలను నిర్ధారించుకోవడం మంచిది.

కోనసీమలో మరో ప్రముఖ ఆలయమైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం, టికెట్లకు సంబంధించిన వివరాలను కూడా మా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

పలివెల 100 స్తంభాల శివాలయం పురావస్తు శాఖ సమాచార బోర్డు
పలివెల 100 స్తంభాల శివాలయం వద్ద కనిపించిన పురావస్తు శాఖ సమాచార బోర్డు

పలివెల 100 స్తంభాల శివాలయం ఎలా చేరుకోవాలి

పలివెల గ్రామం డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలంలో ఉంది. రాజమండ్రి–అమలాపురం ప్రధాన మార్గంలో కొత్తపేట సమీపంలో పలివెల గ్రామం ఉంటుంది. అధికారిక జిల్లా ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం పలివెల రాజమండ్రి నుంచి సుమారు 50 కి.మీ., అమలాపురం నుంచి 25 కి.మీ., కాకినాడ నుంచి సుమారు 90 కి.మీ. దూరంలో ఉంది.

రావులపాలెం నుంచి

రావులపాలెం నుంచి కొత్తపేట వైపు ప్రయాణించి పలివెల చేరుకోవచ్చు. కొత్తపేట నుంచి పలివెల గ్రామం సుమారు 3 కి.మీ. దూరంలో ఉంటుంది. కొత్తపేట వరకు బస్సులో వచ్చి, అక్కడి నుంచి స్థానిక ఆటో ద్వారా పలివెలకు వెళ్లడం సౌకర్యంగా ఉంటుంది.

రాజమండ్రి నుంచి

రాజమండ్రి నుంచి అమలాపురం వైపు వెళ్లే మార్గంలో కొత్తపేట సమీపంలో పలివెలకు చేరుకోవచ్చు. ఈ ఆలయం రావులపాలెం –అమలాపురం మార్గానికి  కొత్తపేట సమీపంలో ఉంది .

రాజోలు వైపు నుంచి వచ్చే వారు

కోనసీమలో రాజోలు వైపు నుంచి వచ్చే వారు స్థానిక రహదారుల ద్వారా కొత్తపేట వైపు చేరుకుని, అక్కడి నుంచి పలివెలకు వెళ్లవచ్చు. సొంత వాహనంలో ప్రయాణించే వారికి గ్రామీణ కోనసీమ ప్రాంతాన్ని చూస్తూ ఆలయానికి చేరుకునే అవకాశం ఉంటుంది.

బస్సు, ఆటో సౌకర్యం

పలివెలకు చేరుకోవడానికి స్థానిక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అన్ని సమయాల్లో బస్సులు అందుబాటులో ఉండకపోవచ్చు. అందువల్ల కొత్తపేట వరకు బస్సులో వచ్చి, అక్కడి నుంచి ఆటోలో పలివెలకు వెళ్లడం ఒక సౌకర్యవంతమైన మార్గం.

సమీప రైల్వే స్టేషన్

రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటిగా ఉపయోగించుకోవచ్చు. కొత్తపేటకు రాజమండ్రి, తణుకు రైల్వే స్టేషన్లు సమీప ప్రధాన రైల్వే స్టేషన్లుగా ఉన్నాయి .

సమీప విమానాశ్రయం

పలివెలకు ప్రయాణించేవారు రాజమండ్రి విమానాశ్రయం (మధురపూడి)  ను ఉపయోగించుకోవచ్చు.

పలివెల 100 స్తంభాల శివాలయం లో ప్రాకారమండపం
పలివెల 100 స్తంభాల శివాలయం లో ప్రాకారమండపం

ముగింపు

పలివెల 100 స్తంభాల శివాలయం చరిత్ర, పురాతన నిర్మాణశైలి, రాతి స్తంభాలు మరియు స్థానిక సంప్రదాయాలతో ప్రత్యేకతను కలిగి ఉంది. ఆలయాన్ని సందర్శించినప్పుడు గమనించిన విషయాలు, పురావస్తు శాఖ సమాచార బోర్డులోని వివరాలు, గ్రామస్తులు తెలిపిన స్థానిక విషయాలను ఈ కథనంలో అందించాను.

కోనసీమలోని పురాతన ఆలయాలను సందర్శించాలనుకునేవారికి పలివెల 100 స్థంభాల శివాలయం ఒక ఆసక్తికరమైన ప్రదేశం.

పలివెల ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం – అధికారిక సమాచారం

తాల్లమ్మతల్లి ముఖద్వారం
తాల్లమ్మతల్లి ముఖద్వారం

పలివెల 100 స్తంభాల శివాలయం వీడియో

పలివెల 100 స్థంభాల శివాలయాన్ని నేను స్వయంగా సందర్శించినప్పుడు తీసిన వీడియోను ఇక్కడ అందిస్తున్నాను. ఆలయ ప్రాంగణం, పురాతన నిర్మాణాలు మరియు అక్కడి ప్రత్యేకతలను ప్రత్యక్షంగా చూడటానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది.

వీడియోను చూసిన తర్వాత ఆలయానికి సంబంధించిన మీ అనుభవాలను కామెంట్ ద్వారా తెలియజేయవచ్చు.

 

Related Post

Leave a Comment