కోనసీమ పొట్టిక్కలు అంటే ఏమిటి?
కోనసీమలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ ఆహారాల్లో అంబాజీపేట పొట్టిక్కలు ఒకటి. ఈ వంటకాన్ని ముఖ్యంగా అంబాజీపేట ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు.
కోనసీమలో ప్రకృతి అందాలతో పాటు ఆహారప్రియులు ఇష్టంగా తినే అనేక రకాల సంప్రదాయ వంటకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన, ఎంతో ప్రాచీనమైన ఆహార సంప్రదాయాల్లో పనస ఆకులతో తయారు చేసే ఈ వంటకం కూడా ఒకటి.
గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా కోనసీమలో కొబ్బరి పంటలతో పాటు వివిధ ఉద్యాన పంటలు విస్తారంగా పండిస్తారు. అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో పనస చెట్లు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల ఈ వంటకం తయారీకి తాజా పనస ఆకులను ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది.
పనస ఆకులను శుభ్రంగా కడిగి, వాటిని కొబ్బరి ఈనెలతో చిన్న బుట్టల ఆకారంలో కుట్టి, అందులో పిండిని వేసి ఆవిరితో ఉడికిస్తారు. పనస ఆకుల సహజమైన సువాసన ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.
పనస ఆకులతో తయారు చేసే ఈ సంప్రదాయ పిండి వంటకాన్నే “పొట్టిక్కలు” అని పిలుస్తారు.

కోనసీమ లో ఎందుకు ఈ సంప్రదాయం ?
కొన్ని వందల సంవత్సరాలుగా , పొలాల అమావాస్య రోజు పనస ఆకులతో చేసిన పిండి వంటకం ను పూజ లో ఉపయోగించే వారు . శ్రావణమాసం లో మొదటగా బహుళ అమవాస్యను పొలాల అమావాస్య అంటారు . ఈ పొలాల అమవాస్య రోజు చాల ప్రాంతాలలో పూజలు చేస్తారు . సౌబాగ్యం కోసం , సంతానం కోసం స్త్రీలు ఈ పూజ చేస్తారు . ముక్యం గా ఈ పొలాల అమావాస్య కి సంతానం లేని వారు చేస్తే మంచి పలితం ఉంటుందని గ్రామిన ప్రాంతాలలలో ఇప్పటికి ఈ ఆచారం ఉంది .
పోలాలదేవి అనే దేవతను ప్రసన్నం చేసుకోవడానికి పూజ లో నైవేద్యం గా కంద మొక్కలు లేదా వాటి పిలకలు, బూరెలు , మరియు పనస ఆకులతో చేసిన ఈ పిండి వంటకం ప్రసాదం గా పెడతారు . అలా పొలాలదేవి ప్రసాదం పవిత్రమైనది , రుచి లోను అమోఘ మైనది . గోదావరి జిల్లాలలో ఈ పోట్టిక్కలు ఈ పూజ లో ఉపయోగిస్తుంటారు .
పోలాలదేవి పూజ విదానం ఈ లింక్ ద్వారా తెలుసుకోండి : https://www.poojalu.com/polala-amavasya-pooja-

పొట్టిక్కలు కోనసీమ లో తయారు చేసే విధానం
తయారీకి కావలసిన పదార్థాలు
1.పనస ఆకులతో చేసిన తాజా బుట్టలు 2. మినప పిండి 3. వరిపిండి 4. తగినంత ఉప్పు
మినపపప్పు ను సుమారు 6 నుండి 8 గంటలు నానబెట్టి పొట్టు తీస్తారు . పొట్టు తీసిన మినప పప్పు ను ఇడ్లి పిండిలా రుబ్బుతారు . అలా రుబ్బిన మినప పిండిలో ఇడ్లి నూక ను తగినంగా కలుపుతారు . రుచికి తగినంతగా ఉప్పును కలుపుతారు . అలా కలిపినా మినప పిండి ని పనస ఆకుల బుట్టలో నిండుగా గరిటతో నింపుతారు . ఈ నింపిన బుట్టలను ఆవిరి మీద ఉడికిస్తారు . ఒక మాటలో చెప్పాలంటే ఇడ్లి ఉడికించినట్ట్టు ఉడికిస్తారు .

ఎలా తింటారు? – తినే పద్ధతులు
ఈ పొట్టిక్కలను వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. గోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో హోటళ్లలో ఈ అల్పాహారం అందుబాటులో ఉంటుంది. అయితే కోనసీమలోని అంబాజీపేట ప్రాంతంలో లభించే పొట్టిక్కలు రుచిలోనూ, శుచిలోనూ మంచి పేరు సంపాదించుకుని, ఒక ప్రత్యేకమైన అంబాజీపేట బ్రాండ్‌గా గుర్తింపు పొందాయి.
అంబాజీపేటలోని స్థానిక హోటళ్లలో వీటిని ప్రముఖంగా వండి వడ్డిస్తారు. కొబ్బరి పచ్చడి, నెయ్యి–కారం, అల్లం పచ్చడి, సాంబార్‌తో కలిపి తింటే ఆ రుచిని మరచిపోలేరు.
నోట్లో వేసుకోగానే మెత్తగా కరిగిపోయే ఈ అల్పాహారం, పనస ఆకుల సహజమైన సువాసనతో ఎంతో కమ్మని రుచిని, సంతృప్తిని అందిస్తుంది.
అంబాజీపేట లో ఎందుకు ప్రసిద్ధి చెందాయి?
పచ్చని పనస ఆకులతో బుట్టలు చేయడం , దానిలో వండడం ఈ తరం వారికి కొంచెం కొత్తగా అనిపిస్తాయి . అందుకే గోదావరి జిల్లా లలో లబించే ఈ పొట్టిక్కలు మంచి ప్రాముఖ్యత సంపాదించు కున్నాయి . కొనసీమ ను సందర్శించే పర్యాటకులు ఈ రుచిని ఆస్వాదించి మరో పదిమందికి చెబుతారు . అలా పురాతన మైన ఈ వంటకం ప్రసిద్ది చెందింది .సినిమా వారు ఇటు వైపు వస్తే తప్పకుండా వీటి రుచి చూస్తారని అంబాజీపేట లోని ఒక హోటల్ యజమాని సంతోషంగా చెప్పారు . ఇలా తనికెళ్ళ భరణి గారు , గౌతంరాజు గారు , పెద్ద వంశీ గారు ఈ పిండి వంట రుచి చూసిన వారే .

పొట్టిక్కలు – ఆరోగ్య ప్రయోజనాలు
పొట్టిక్కలలో మినపపిండి, వరి నూక వంటి సాధారణ పదార్థాలు ఉపయోగిస్తారు. నూనెలో వేయించకుండా ఆవిరితో ఉడికించడం ఈ వంటకం ప్రత్యేకత.
తాజా పనస ఆకులో ఉన్న ఆరోమాలు మన శరీరానికి కావలసిన పోషకాలు పరోక్షంగా అందిస్తాయని చెబుతారు .
నేటి తరం & కోనసీమ సంప్రదాయ ఆహారం
ఈ తరం పిల్లలకు పురాతన కాలం నాటి మన సంప్రదాయ రుచులు రుచి చూపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. నేటి ఆధునిక కాలంలో పిల్లలు ప్యాకెట్ ఫుడ్‌కు అలవాటు పడి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మన తాతముత్తాతలు ఎలాంటి ఆహారం తీసుకునేవారు, వారు ఎలా ఆరోగ్యంగా జీవించేవారు అనే విషయాలను పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం అల్పాహారంగా తీసుకునే ఈ పనస ఆకులతో చేసే వంటకం రుచిని ఈ తరం పిల్లలకు పరిచయం చేసి, మన తర్వాతి తరానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎలాంటి కృత్రిమ పదార్థాలు లేకుండా సహజంగా తయారయ్యే మన పల్లెటూరి సంప్రదాయ వంటకాల గురించి పిల్లలకు తెలియజేయడం మనందరి బాధ్యత. సాధారణ పదార్థాలతో అసాధారణమైన రుచిని అందించే, తక్కువ ఖర్చుతో కడుపు నింపే అల్పాహారం ఈ వంటకం.
ఇటీవలి కాలంలో రావులపాలెం, అమలాపురం, అంబాజీపేట ప్రాంతాల్లో ఈ ఆహారం విరివిగా లభిస్తోంది. మీరు ఒకసారి గోదావరి జిల్లాలకు వస్తే, ఈ సంప్రదాయ వంటకాన్ని తప్పక రుచి చూడవచ్చు.
ఈ విధంగా కోనసీమ గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే సంప్రదాయ వంటకాలు ఎన్నో ఉన్నాయి. అయితే సహజమైన పనస ఆకులతో తయారు చేసే ఈ వంటకం వాటిలో ఒక ప్రత్యేకమైనది.

అంబాజీపేట పొట్టిక్కలు – Traditional Food – Konaseema
కోనసీమ గురించి మరిన్ని ఆసక్తికరమైన పోస్టులు చదవండి:
అంబాజీపేట పొట్టిక్కలు వీడియో
అంబాజీపేట పొట్టిక్కల తయారీ విధానం, రుచి మరియు ప్రత్యేకత గురించి ఈ వీడియోలో చూడండి:










